తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేపడతామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా మద్యం దుకాణాలను దశలవారీగా ఎత్తివేసే దిశగా కొత్త పాలసీని తీసుకురావాలని తాజాగా నిర్ణయించారు జగన్.
దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు.